నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమమైన ఎస్‌ఎస్‌ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) సందర్బంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదివారం ఖిల్లా రోడ్డులో గల క్రీసెంట్ బాలికల హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటర్ లిస్టులో పేరు ఉన్న వారి ప్రతి ఇంటిని టచ్ చేయాలని 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన వారిలో ఇంకా ఎవరైనా ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే సరిచూసుకొని తప్పనిసరిగా ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఓటర్ల జాబితాలో చిరునామాల మార్పు పోలింగ్ స్టేషన్ల మార్పు నియోజకవర్గాల మార్పు చనిపోయిన వారిని తొలగించుటకు కూడా ప్రజలు సంబంధిత బిఎల్‌వోలకు సంబంధిత ఫారాలలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. తద్వారా తప్పులు లేని స్వఛ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయుటకు పౌరులుగా తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఆయన కోరారు.
ప్రత్యేక ఓటర్ నమోదు సందర్భంగా బిఎల్‌వోలు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాలలో సంబంధిత ఫారాలతో అందుబాటులో ఉండాలని ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. అనంతరం నవంబర్ 11 మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా ఎడ్యుకేషన్ డే సందర్భంగా కైసర్ నిర్వహిస్తున్న ఉర్దూ ఎస్సే రైటింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, తహసిల్దార్ ప్రసాద్, డి టి సాయిలు తదితరులు పాల్గొన్నారు.