బోధన్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పాలక వర్గ పార్టీలు విఫలం అవుతున్నాయని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం బోధన్ పట్టణం ఉర్దూగర్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి. మల్లేష్ మాట్లాడారు.
కార్మికుల సంక్షేమానికై వసూలు చేసిన సెస్సు వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నప్పటికీ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలిపారు. లేబర్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసిన అప్లికేషన్లు పెండిరగ్ ఉన్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదంలో మరణించిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సహజ మరణానికి రెండు లక్షలు ఇవ్వాలని పెండ్లి కానుకగా లక్ష రూపాయలు ఇవ్వాలని డెలివరీ బెనిఫిట్ 50 వేలకు పెంచాలని చదువుకునే కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని, 58 సంవత్సరాల కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ నెలకు ఐదు వేలు ఇవ్వాలని బి. మల్లేష్ డిమాండ్ చేశారు.
సమావేశంలో తన్వీర్, జలాల్, లతీఫ్, నజీర్, ముబారక్, అస్లాం, ఖాసీం లియాకత్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.