నిజామాబాద్, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు జారీ అయినందున ప్రవర్తన నియమాలు వెంటనే అమల్లోకి వచ్చిందని అధికారులు ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు రిటైర్ కానున్న సందర్భంగా వాటికి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. ఈనెల 16న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని, డిసెంబర్ 10న ఎన్నికలు ఉంటాయని, 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వచ్చిందని, అధికారులు ఈ దిశగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి కొత్త కార్యక్రమాలు, శంకుస్థాపనలు గాని, ప్రారంభోత్సవాలు కానీ చేపట్టవద్దని, రాజకీయ పార్టీల సమావేశాలకు హాజరు కాకూడదని, కొత్తగా మంజూరు చేపట్టవద్దని తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, సంస్థలలో రాజకీయపరమైన రాతలు కానీ, ఫ్లెక్సీలు కానీ, ఫోటోలు కానీ ఉంటే వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. రోజువారీ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా రాజకీయపరమైన ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేయవద్దని ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సెల్ కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, మూడు డివిజన్ల ఎసిపిలు, మున్సిపల్ కమిషనర్‌లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.