ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 10న జరిగే ఎం.ఎల్‌.సి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ఎం.ఎల్‌.సి ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాలలో 12 సీట్లకు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో ఉన్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యుల్‌ విడుదల చేసిందని, నవంబర్‌ 16న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని ఆయన తెలిపారు. నవంబర్‌ 16 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుందని, డిసెంబర్‌ 10న పోలింగ్‌, డిసెంబర్‌ 14న కౌంటింగ్‌ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నల్గోండ, వరంగల్‌, మహబూబ్‌ నగర్‌, ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారని, వీరు మిగిలిన కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్భందిగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, దీనిని పకడ్భందిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఓటర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు అనువైన కేంద్రాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రాల జాబితా ఫైనల్‌ చేసి పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు జిల్లాల వారిగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల జాబితా పంపాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌తో నిర్వహించడం జరుగుతుందని, బ్యాలెట్‌ బాక్సులను సిద్దం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో పకడÄరేదిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అన్నారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సమయంలోను అమలు చేయాలని ఆయన తెలిపారు. హుజురాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో అమలు చేసిన విధానాలను యథావిధంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. భారత ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా ప్రజలు హజరుకావద్దని, బైక్‌ ర్యాలీ, కార్ల ర్యాలీలకు అనుమతి లేదని, ఇంటింటి క్యాంపేన్‌ 5 మంది, వీడియో వ్యాన్‌ క్యాంపెన్‌ 50 మంది, 72 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని అధికారులకు సూచించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి , కరోనా మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని సిఈఓ ఆదేశించారు. ఎన్నికల సమయంలో నియమాలను పాటిస్తు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకునే విధంగా వారికి ముందస్తుగా అనుమతులు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరు నారాయణ రెడ్డి, అదనపు కలెక్టరు చంద్రశేఖర్‌, అదనపు సీపీ అరవింద్‌, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »