వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు టి. హరీష్‌ రావు దిశానిర్దేశం చేశారు.

శనివారం హైదరాబాద్‌ నుండి వైద్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్‌ శ్రీనివాస రావుతో కలిసి జిల్లాల కలెక్టర్లు, డిఎం అండ్‌ హెచ్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యాక్సినేషన్‌, వైద్య శాఖ పనితీరు, కొత్త మెడికల్‌ కళాశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ తదితర విషయాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 2.77 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా తీసుకొని జనవరి 16న ప్రారంభించి మొదటి కోటి డోసులకు 165 రోజులు పట్టగా, రెండవ కోటికి 78 రోజులు, మూడవ కోటికి 27 రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికీ 85 శాతం మొదటి డోస్‌ పూర్తయిందని తెలిపారు. ప్రజలకు సేవలందించడంలో వైద్య శాఖ చాలా ముఖ్యమైనదని ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేసుకుంటూనే మరోవైపు ప్రజలకు జవాబుదారీతనంతో పని చేయవలసి ఉన్నదని జిల్లాల కలెక్టర్లు రెగ్యులర్‌గా ఆసుపత్రుల పనితీరుపై సమీక్షలు నిర్వహించి ఆసుపత్రులలో పర్యటించి అందిస్తున్న సేవల గురించి పర్యవేక్షణ చేయాలన్నారు.

తాను కూడా జిల్లాల్లో పర్యటించినప్పుడు ఆకస్మికంగా ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులలో తప్పకుండా పర్యటన చేసి అనాసక్తంగా ఉన్నవారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంట్లపై ఫోకస్‌ చేయాలని కలెక్టర్లకు అధికారులకు సూచించారు. ఆస్పత్రులలో ఎంతో విలువైన మిషన్లు ఏర్పాటు చేస్తున్నామని చిన్న చిన్న సమస్యలు వస్తే వదిలేయకుండా మరమ్మతులు చేయించి అవి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆస్పత్రులలో సిటీ స్కాన్‌ డయాగ్నస్టిక్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఇంకా ఎందుకు బయటకు వెళుతున్నారో పరిశీలన చేయాలన్నారు. డాక్టర్లు ఉండి కూడా సంతృప్తికరంగా శస్త్ర చికిత్సలు జరగడం లేదన్నారు. హెల్త్‌ కేర్‌ వర్కర్‌ నుండి నర్సులు డాక్టర్‌ల వరకు వారి విధులకు సంబంధించి ప్రతి నెల లక్ష్యాలు నిర్దేశించి ఆ విధంగా పని చేసే విధంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన పాటించాలని ప్రాథమిక వైద్య కేంద్రాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్‌లు ఆసుపత్రిలో ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం ద్వారా 35 శాతం నిధులు వస్తాయని తెలిపారు.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో 946 రకాల చికిత్సలకు ప్రభుత్వ ప్రైవేట్‌లో సౌలభ్యం ఉన్నదని, ఈ పథకం కింద కొత్తగా మరో 646 శస్త్ర చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించడానికి అవకాశం ఉన్నదని వీటిని వైద్యాధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలో ఓపిబిఐపి ఆరోగ్యశ్రీ సమయపాలన శానిటేషన్‌ తదితర కార్యక్రమాలపై సమీక్ష జరగాలని ఆసుపత్రుల పరిసరాలు చుట్టుపక్కల ఆసుపత్రులలో ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కనిపించే విధంగా తీర్చిదిద్దాలని ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు రోగులకు ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సింగపూర్‌, యుకె, రష్యా, చైనాలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయని ప్రజలందరూ వ్యాక్సినేషన్‌ తీసుకొని దాని నుండి బయట పడాలని ఆయన కోరారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి డోస్‌ 104 శాతం, హైదరాబాదులో 102, మేడ్చల్‌లో 94 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంపై ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య శాఖ అధికారులను అభినందించారు. గద్వాల, నారాయణపేట తదితర జిల్లాలలో లక్ష్యాలు పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, టీబి, లెప్రసి, బ్లైండ్నెస్‌ తదితర విభాగాలు కూడా సరిగా పని చేసే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు.

వ్యాక్సినేషన్‌ వివరాలన్నీ కోవిన్‌ ఆప్‌లో నమోదు చేయాలి – కలెక్టర్‌

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ తీసుకున్నవారిలో ఇంకా కొంత మంది వివరాలు కోవిన్‌ పోర్టల్‌ లో నమోదు కాలేదని ఆశా వర్కర్లు ఈ వివరాలను సేకరించి ప్రతి ఆశ వర్కర్‌ ప్రతిరోజు కనీసం పది మందికి తక్కువ కాకుండా నమోదు చేయించాలని ఆదేశించారు. ప్రతి ఎఎన్‌ఎమ్‌ ప్రతి రోజు 50 మందికి తక్కువ కాకుండా మొదటి డోసు గాని రెండో రోజు గాని వ్యాక్సిన్‌ తప్పనిసరిగా అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైద్యులు వైద్యాధికారులు ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు తప్పనిసరిగా విధులలో ఉండవలసిందే అన్నారు. బయటకు వెళితే కదలికల రిజిస్టర్లో నమోదు చేసి వెళ్లాలన్నారు. మంత్రి ఆదేశాల ప్రకారం అన్ని విషయాలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు సాయంత్రం జూమ్‌ మీటింగ్‌ ఉంటుందని మీటింగ్‌కు అందరూ కూడా వారి పరిధిలోనుండే హాజరుకావాలని ఆదేశించారు.

సమావేశంలో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ చిత్రా మిశ్రా, ఇంచార్జ్‌ డిఎమ్‌ హెచ్‌ఓ సుదర్శనం, డిపిఓ జయసుధ, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వోలు, రమేష్‌ రాథోడ్‌, తుకారం, విద్య, డిఐఓ శివ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »