కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జిలను ఆదేశించారు.
రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్ నెంబర్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్ తీసుకు వస్తే ఓటీపీ నెంబర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు తెలియజేయాలని సూచించారు. రైతులకు అవగాహన లేకపోతే క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.
సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రం వివరాలు రైతులకు తెలియజేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. తూకం వేసిన వెంటనే ధాన్యం లారీలో రైస్ మిల్ కు తరలించాలని కోరారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరిగే విధంగా చూడాలన్నారు. అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల ఇన్చార్జినే ధాన్యం సేకరణ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ట్రక్ షీట్ వారీగా రైతుల పేర్లు నమోదు చేయాలని, ఓటిపి నెంబర్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్‌లో సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఇంచార్జి డిఎల్ సివో రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.