నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాతే పాలక వర్గాలకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటగల్లి శ్రామిక భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌లకు, కార్పొరేటర్లకు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్‌లకు 30 శాతం వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
మున్సిపల్ కార్మికులకు వేతన పెంపు ప్రకటించి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కార్మికులకు వేతనాలు పెంచకుండా, పాలకవర్గాలకు పెంచడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో పెరిగిన ధరలతో కనీస నిత్యవసర వస్తువులు కూడా కొనలేని దీన స్థితిలో ఉన్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులకు మొండిచేయి చూపడం సరైంది కాదన్నారు.
ఇది మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం యొక్క వివక్షతను చూపెడుతున్నారు. మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలను అమలు చేసి, ఆ తర్వాత పాలకవర్గాలకు వేతన పెంపు అమలు చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాజేశ్వర్, గోవర్ధన్, శివకుమార్, చంద్రకాంత్, శివకుమార్, రవికిరణ్‌లు పాల్గొన్నారు.