డిచ్‌పల్లి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకి పి.డి.ఎస్.యు, పీ.వై.ఎల్ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్, నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన పార్ట్ టైమ్ టీచర్లను తొలగించారన్నారు. కానీ సౌత్ క్యాంపస్ ఫిజిక్స్ విభాగంలో అక్రమ పద్ధతిలో ముగ్గురు పార్ట్ టైం లెక్చరర్లుగా నియామకమై, మళ్లీ తప్పుడు పద్ధతిలో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేకుండా, వారిని అకడమిక్ కన్సల్టెంట్లుగా మార్చారన్నారు.
ఫిజిక్స్ డిపార్టుమెంటుకు సంబంధం లేకుండానే రెండున్నర సంవత్సరాలుగా వీరికి అకడమిక్ కన్సల్టెంట్స్‌గా వేతనాలు వస్తున్నాయన్నారు. ఇది యూనివర్సిటీ డబ్బులను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. ఈ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. అక్రమ నియామకాలను కాపాడే ప్రయత్నం చేస్తే ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు.
అక్రమ నియమకాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. సానుకూలంగా స్పందించిన వీ.సీ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు రాష్ట్ర నాయకులు నరేందర్, జిల్లా నాయకులు ప్రణయ్, పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్, జిల్లా అధ్యక్షుడు బి.కిషన్, ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం. సుధాకర్, విఠల్, అశుర్ తదితరులు పాల్గొన్నారు.