యాసంగిలో వరి సాగు వద్దు

కామారెడ్డి, నవంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే యాసంగి సీజన్‌లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాలపై శనివారం అన్ని జిల్లా కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి 1 కేజీ బాయిల్డ్‌ రైస్‌ కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని సీఎస్‌ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌.సి.ఐ బాయిల్డ్‌ రైస్‌ కోనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని సీఎస్‌ పేర్కొన్నారు.

యాసంగి సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతు వేదికలో వెంటనే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. రైతు యాసంగి సీజన్‌లో తన సొంత అవసరాలకు, విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉంటే సోంత పూచికత్తుపై మాత్రమే వరి సాగు చేయాలని, ఈ సమాచారం వెంటనే క్షేత్ర స్థాయిలో రైతులకు తెలియజేయాలని సీఎస్‌ తెలిపారు.

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం సీఎస్‌ వానాకాలం వరి సాగుపై చర్చించారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన ప్రదేశాల్లో అదనపు కోనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో వీలైనంత త్వరగా వానాకాలం వరి కోనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎస్‌ సూచించారు. వానాకాలం పంట కోనుగోలుపై దృష్టి సారించాలని, ప్రతి మండలానికి సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన స్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అధికంగా పెండిరగ్‌లో ఉన్న మండలాల్లో కలెక్టర్‌ వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎస్‌ ఆదేశించారు. జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న మిల్లింగ్‌ రైస్‌ లక్ష్యాలు పూర్తి చేయాలని సీఎస్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 40 వేల మెట్రిక్‌ టన్నుల రైస్‌ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సూర్యాపేట నల్గొండ, సిద్దిపేట, మెదక్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో అధికంగా మిల్లింగ్‌ రైస్‌ పెండిరగ్‌ ఉందని వీరు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్‌ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు సైతం ధాన్యం విక్రయిస్తున్నట్లు సమాచారం వస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో నివారించాలని తెలిపారు.

ధాన్యం దళారులపై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్‌పోస్టులను అప్రమత్తం చేయాలని డిజిపి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. 15 రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ చెక్‌ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఇన్చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, జిల్లా సహకార అధికారిని వసంత, ఇంచార్జ్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్‌, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్‌ మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, జిల్లా రవాణా సంస్థ అధికారిని వాణి, అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »