నిజామాబాద్, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తానని ఏడు సంవత్సరాలుగా ప్రకటనలు చేస్తున్నదని కానీ, ఇప్పటికీ అమలుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిరోజు ఉదయమే దూరప్రాంతాల నుంచి కాలేజీకి అర్ధాకలితో వస్తున్న విద్యార్థులు, సాయంత్రం వరకు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. అదేవిధంగా విద్యార్థినులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. కావున ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించాలన్నారు.
జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంటర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యూ నగర నాయకులు అశుర్, సాయితేజ, మహిపాల్, వేణు, నవీన్, రెహాన్, అభినయ్, శ్రీకర్, నరసింహచారి విద్యార్థులు పాల్గొన్నారు.