కామారెడ్డి, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు నిరంతరం పాటుపడాలని కోరారు. ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని, మందులు ఉన్నాయని వాటిని క్రమం తప్పకుండా వాడితే నివారణ చేయడం సులభమని పేర్కొన్నారు.
రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఎనిమిది మంది గర్భిణీలకు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వారి పిల్లలకు రాకుండా వైద్య శాఖ చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టాళ్లను పరిశీలించారు. వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
రక్తదాతలకు ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఎయిడ్స్ వ్యాధిని అంతం చేద్దామని గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ముందుంటామని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా మహిళా, పిల్లల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి, ఎయిడ్స్ నియంత్రణ ప్రోగ్రాం అధికారిని మౌనిక, వైద్యురాలు విజయలక్ష్మి, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శోభారాణి, రోజు చైల్డ్ లైన్ 1098 కోఆర్డినేటర్ అమృత రాజేందర్, అధికారులు మహేష్, అంజయ్య, వరల్డ్ ఆర్గనైజేషన్, బాలల సంరక్షణ ప్రతినిధులు పాల్గొన్నారు.