కామారెడ్డి, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా రెవిన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అర్హత గల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేయాలని కోరారు. గతంలో దాడులు చేసిన వ్యక్తులను గుర్తించి తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. గ్రామాలలో రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆయా శాఖల భూములను గుర్తించాలని పేర్కొన్నారు.
అటవీ భూములను ఆక్రమించిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పారు. ఎక్కడైనా అటవీ భూముల ఆక్రమించినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం వస్తే ఇద్దరు వెళ్ల వద్దని, 20 మంది బృందంగా ఏర్పడి ఆ గ్రామానికి వెళ్లి చూడాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానితులను అటవీ అధికారులు గుర్తించాలని సూచించారు. 2018 నుంచి 2021 నవంబర్ 30 వరకు అటవీశాఖ అధికారులపై దాడులు చేసినట్లు ఇరవై నాలుగు కేసులు నమోదైనట్లు చెప్పారు.
ఈ దాడులలో 84 మంది పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. అటవీ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. అడవిలో ఎవరైనా వృక్షాలు నరికితే వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని సూచించారు. అటవీ భూమి ఆక్రమణ జరిగితే అటవీ అధికారులు ఇద్దరు వెళ్లకుండా స్థానిక పోలీసులను వెంట తీసుకెళ్లాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్‌చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా అటవీ అధికారిని నిఖిత, ఆర్‌డివోలు శీను, రాజా గౌడ్, అటవీ, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.