లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి

నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా.  కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!?  నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి.  అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. 

ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి.  ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో వున్న లింగాన్ని చూడవచ్చు.  నరసింహస్వామే అక్కడ ఆ రూపంలో వెలిశాడు.  దాని కధేమిటంటే… వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్నిసురభి వంశానికి చెందిన  సింగమనాయుడు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ స్వామి ఆవిర్భావం జరిగింది.  సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది. 

ఎన్నిసార్లు  దానిని తీసి పక్కకి పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డువస్తుంటే, ఆ రైతు చేసేది లేక,  తాను పేదవాడినని, పొలం పండిస్తేగానీ తన కుటుంబాన్ని పోషించలేననీ, తన పనికి ఆటంకాలు రానీయవద్దని శ్రీమన్నారాయణుడిని ప్రార్ధించాడు.   భక్తుడి మొరవిన్న భగవంతుడు ఆ రోజు రాత్రి సింగమనాయుడి కలలో కనిపించి, తాను ఉత్తర దిశలో వున్న పొలంలో వెలిశానని, తనని రైతు గుర్తించలేక పోయాడని, తనని గుర్తించి, ప్రతిష్టించి, పూజలు జరపమని ఆదేశించాడు. రాజు తలచుకుంటే కాని పనేమిటి?  ఆయన తన పరివారంతో వెళ్ళి స్వామి చెప్పిన గుర్తుల  ప్రకారం వెదుకగా లింగ రూపంలో వున్న ఒక శిల కాంతులీనుతూ కనిపించింది.  అదే రాత్రి కలలో స్వామి చెప్పిన విగ్రహంగా గుర్తించి, దానిని ఊరేగింపుగా  తీసుకుని ఊరిలోకి రాగా ప్రస్తుతం ఆలయం వున్న వెనక ఎత్తైన బండ దగ్గరకి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నృసింహుడినని చెప్పారుట. 

ప్రధమంగా స్వామి ప్రతిమని ఇక్కడే దించారు. కనుక దీనికి “పాదం గుడి” అని పేరు.  ఇక్కడ స్వామి పాదం గుర్తులున్నాయి.  అప్పటినుంచీ ఇప్పటిదాకా స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి.  అంతేకాదు, స్వామికి ఎండ తగలకుండా వుండటానికి మొదట్లో నాపరాయితో  చిన్న గుడి నిర్మించారు.  దానిని  నేటికీ గర్భగుడిలో భక్తులు దర్శించవచ్చు. నరసింహస్వామికి ఒక కన్ను కిందకు, ఒక కన్ను మీదకు, ఎగుడు దిగుడుగా వుంటాయి.  ఎడమ కన్ను కింద భాగంలో కమలం వున్నది.  కమలం లక్ష్మీ స్ధానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడు అన్నారు.  ఈ కొండకు శ్వేతాద్రి అని పేరు. నరసింహస్వామిని ప్రతిష్టించిన సమయంలోనే ఆంజనేయస్వామినికూడా ప్రతిష్టించారు. 

ఈ స్వామి విశేషం లింగాకారంలో వుండటమేకాదు, హరి హరులకు భేదం లేదు అని తెలుపటానికా అన్నట్లు స్వామికి త్రిపుండ్రం (అడ్డ నామాలు), ఊర్ధ్వ పుండ్రాలు (నిలువు నామాలు) వున్నాయి.  పూర్వం శైవులకు, వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం వుండేది. ఆ సమయంలో ఈ స్వామి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది.  ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబ, సమస్య పరిష్కారానికి  పుష్పగిరి పీఠాధిపతులను, జీయర్ స్వాములను ఆహ్వానించారు.  వారు స్వామివారికి అభిషేకం చేసి చూస్తే హరి హరులకు బేధాలు లేవు అని తెలపటానికా అన్నట్లు, స్వామికి అడ్డ నామాలతోపాటు నిలువు నామాలు కూడా కనిపించాయి.  అప్పటినుంచీ ఈ బేధాలు లేని స్మార్తులైన ఓరుగంటి  వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. 

ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయం, పుష్కరిణి కూడా నిర్మించారు. మొదట నాపరాయితో చిన్నగా కట్టబడిన ఈ గుడి తర్వాత కాలంలో అభివృధ్ధి చెందింది.  నిజాం కాలంలో మంత్రి చందూలాల్ బహద్దూర్ ఈ దేవాలయానికి అనేక భూములు ఇచ్చారు.  అతి ప్రాచీనుడైన ఈ దేవునికి ఆలయం క్రీ.శ. 1795 లో నిర్మింపబడింది.   పుష్కరిణి ఇక్కడ పుష్కరిణిలో భక్తి శ్రధ్ధలతో స్నానం చేస్తే అన్ని రోగాలూ పోతాయని భక్తుల విశ్వాసం.  భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటారు. 

అంతేకాదు, భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమకు లేచిన గడ్డలు, కురుపులు పోతాయని విశ్వసిస్తారు.   తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఆ ప్రాంతంలో జలాశయాలన్నీ ఎండిపోయినా,  ఈ పుష్కరిణిలో మాత్రం నీరు వుండటం ప్రత్యేకత. రత్నలక్ష్మి అమ్మవారు శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా అర కిలో మీటరు దూరంలో రత్నగిరి అనే కొండ వున్నది. 

ఈ కొండమీద క్రీ.శ. 1857 లో రాణి రత్నమాంబ రత్నలక్ష్మీదేవిని ప్రతిష్టించారు.  ఈ కొండమీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజావారి పురాతన విడిది భవనం. ఉత్సవాలు సంక్రాంతి నుంచి వారం రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, తర్వాత 25 రోజులు జాతర జరుగుతాయి.  వీటికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.

మార్గము మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో వున్న ఈ క్షేత్రం కొల్లాపూర్ నుంచి 9 కి.మీ. ల దూరంలో వున్నది.

Check Also

Hello world!

Print 🖨 PDF 📄 eBook 📱 Welcome to WordPress. This is your first post. Edit …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »