కామారెడ్డి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 15 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాల్లో రేషన్ షాపుల వద్దకు ఉదయం పూట ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకొని వారిని డీలర్ల సహకారంతో గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులతో సమీక్షించారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు ఆరోగ్య కార్యకర్తలు పోటీతత్వంతో పనిచేయాలని కోరారు.
వైద్య ఆరోగ్య, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి పట్టణాల్లో 100 శాతం మొదటి డోసు పూర్తయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. డిసెంబర్ 17లోగా 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. తక్కువ వ్యాక్సినేషన్ చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల, అధికారుల భాగస్వామ్యంతో పూర్తిచేయాలని వైద్యులను ఆదేశించారు.
వ్యాక్సినేషన్ పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.