నిజామాబాద్, డిసెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు స్థానిక గంగస్తాన్ ఫేస్ 3 లోని రామకృష్ణ సేవా సమితిలో శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపిక చేయబడ్డ యువతీ యువకులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దేశ భక్తి – జాతి నిర్మాణం అనే అంశం మీద జరిగిన ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా యువత పాల్గొన్నారు.
కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా తెలంగాణ విశ్వ విద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు, హిందీ పండిత్ శ్రీమన్నారాయణ చారి, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయి ప్రసాద్ వ్యవహరించారు. పోటీల అనంతరం విజేతలకు నగదు బహుమతి చెక్, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. ప్రథమ స్థానంలో గౌరీ పవార్, ద్వితీయ స్థానంలో శ్రీనిధి, తృతీయ స్థానంలో అంబిడి దీపక్ నిలిచారు.
జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళవలసి ఉంటుందని, అక్కడ కూడా మంచి ప్రదర్శన చెయ్యాలని, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ కోరారు. విద్యార్థులు, యువత ఇలాంటి పోటీల్లో మరింత ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని, దేశభక్తి, దేశ నిర్మాణం వంటి విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాలని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పెద్దలు తెలిపారు.
కార్యక్రమ నిర్వహణలో తమకు సహకరించిన రామకృష్ణ సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. కార్యక్రమంలో రేష్మ, శ్రీలత, లత, నరేష్ ఇతర వాలంటీర్లు పాల్గొన్నారు.