వేల్పూర్, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో ఎంపిపి, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన యాసంగి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో వరి పంటకి బదులుగా మొక్కజొన్న, జొన్న, మినుము,పెసర వంటి పంటలు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయవలసిందిగా సూచించారు.
ఒకే పంట సాగు చేయడం వలన పంటకు వాడే ఎరువుల వలన భూమి సారవంతం కోల్పోయి చౌడు నేలలుగా మారే ప్రమాదం ఉంది కావున రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపవలసిందిగా సూచించారు.
పంట మార్పిడి వలన కలిగే లాభాలు :
- పంట మార్పిడి వలన భూమిలోని సారవంతం పెరుగుతుంది.
- వరి పంటకి బదులుగా మినుము పెసర వంటి నత్రజని స్థిరీకరణ చేసే పంటలు సాగు చేయాలి. దీనివలన భూమిలో స్థిరీకరణ జరుగుతుంది, ఎరువుల వాడకం తగ్గుతుంది.
- పప్పు దినుసులు వరి పంట తర్వాత నవంబర్ 15 నుండి డిసెంబర్ 10 వరకు విత్తనాలు విత్తుకోవచ్చు.
- నూనెగింజ పంటలు కూడా మంచి లాభదాయకంగా ఉన్నందున ప్రస్తుతం నువ్వు పంట జనవరి రెండవ పక్షం నుండి సాగు చేయాలి.
కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున, ఆత్మ కమిటీ చైర్మన్ నోముల రవీందర్, సర్పంచ్ రజిత చంద్రమోహన్, ఎంపీటీసీ డొల్ల సత్తెమ్మ రాజేశ్వర్, సొసైటీ చైర్మన్ రాజేశ్వర్, విఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు బాలరాజు, మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, ఏఇవోలు సంధ్య, ప్రశాంత్, పవిత్రన్, శ్రీనివాస్, గ్రామ రైతులు పాల్గొన్నారు.