కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఉన్నారు. కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు వారిద్దరికి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. రూసా నిధులతో కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న కమీషనర్ భవనాన్ని పరిశీలించారు. పాత భవనాన్ని పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.
అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి సమావేశమయ్యారు. కళాశాలలో అడ్మిషన్స్ సంఖ్య పెంచడానికి కృషి చేయాలని కమీషనర్ సూచించారు. న్యాక్ గుర్తింపు కోసం వెళ్తున్న సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలకు న్యాక్‌లో మంచి గ్రేడ్ సాధించి, అటానమస్ కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాల భవనం పరిశీలించి అందులో బాలుర వసతిగృహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ విషయమై ఈ వారంలోనే కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కమీషనర్ కలెక్టర్‌తో కలిసి కళాశాల రాశివనంలో మామిడి మొక్క నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, అధ్యాపకులు రాణి, డా.వి.శంకర్, డా.రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రామస్వామి, శివకుమార్, శరత్ రెడ్డి, డా.గణేశ్, సూచరణ్, శ్రీనివాస్, ఫర్హీన్ ఫాతిమా, ఏ.ఓ.జయలక్ష్మి, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.