డిచ్‌పల్లి, డిసెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న 2 వేల 500 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్, పివైఎల్ డివిజన్ అధ్యక్షులు వి.సాయినాథ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా పిడిఎస్‌యు నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్ధులతో రైల్వే కమాన్ నుండి డిచ్‌పల్లి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ 2 వేల 500 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవటంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కాలేజీలలో సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు ప్రైవేటు యాజమాన్యాలు డబ్బులు కట్టాలని విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొందరు విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి మరి సర్టిఫికెట్స్ తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు వేల కోట్లు కేటాయిస్తున్నారని, ప్రజాప్రతినిదుల జీతాలు పెంచుకుంటున్నారని కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయటం లేదని, ఇది సరైంది కాదని, చాలా మంది విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ తీసుకోలేక పై చదువులకి వెళ్లలేక చదువును మధ్యలో మానేస్తున్నారని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రభుత్వం కోర్సులకి నిర్ణయించిన ఫీజుకు పూర్తిగా చెల్లించడం లేదని, కావున పెండిరగ్‌లో ఉన్న 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్, యూనివర్సిటీ కార్యదర్శి సంతోష్, డివిజన్ కమిటీ నాయకులు మనోజ్, రమేష్, భరత్ చంద్ర విద్యార్థులు పాల్గొన్నారు.