కామారెడ్డి, డిసెంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 లోగా అర్హత గల వారికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలపై సమీక్ష నిర్వహించారు.
గ్రామస్థాయిలో రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీ అధికారులు ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకొని వారి వివరాలు సేకరించాలని సూచించారు. వ్యాక్సినేషన్ చేయించుకొని వారికి చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మొదటి డోసు పూర్తయిన వారు రెండో డోస్ తప్పనిసరిగా తీసుకునే విధంగా చూడాలన్నారు.
మున్సిపల్‌లో వార్డుల వారీగా వ్యాక్సినేషన్ వేయించుకొని వారి వివరాలు సేకరించాలని కమిషనర్లను ఆదేశించారు. ఈనెల 19 లోగా బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఐదు చొప్పున మినీ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడానికి రెవెన్యూ, అటవీ అధికారుల సహకారం తీసుకొని స్థలాలను గుర్తించాలని చెప్పారు.
గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠ ధామాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీలు ప్రతి ఒక్కరు ఈశురమ్ బీమా సౌకర్యాన్ని పొందే విధంగా మండల స్థాయి అధికారులు చూడాలని పేర్కొన్నారు. ఐకేపీ అధికారులు వివోఎల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించాలని కోరారు. ఉపాధి పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో శ్రమశక్తి సంఘాలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఇన్చార్జి పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, జెడ్‌పి సీఈఓ సాయా గౌడ్, డిఎల్‌పిఓ సాయిబాబా, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.