కామారెడ్డి, డిసెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి అన్యోన్య సందర్శించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఇందులో భాగంగా మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి ఏ.ఎస్పి అన్యోన్య పుష్పాలతో అలంకరించి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా అన్యోన్య మాట్లాడుతూ ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు తన సొంత ఖర్చులతో కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. పాఠశాలలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చెట్లు నాటడంతో ఏర్పడిరదని, పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కూర్చోడానికి, రాసుకోవడానికి అనుకూలంగా ఉన్న డెస్కులను ఏర్పాటు చేయడం, అన్ని మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వారమే అని మీరు కూడా మంచిగా చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని భవిష్యత్తులో మీరందరూ కూడా కలెక్టర్లు, ఎస్పీలు, డాక్టర్లు, టీచర్లు లాంటి ఉన్నత స్థానంలో ఉండాలని పిల్లలకు హితబోధ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి, విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు అనురాధ, విద్య వాలంటరీలు భాగ్య, రోజా, తదితరులు పాల్గొన్నారు.