ఆర్టీఐకి మీడియా తోడుంటేనే సక్సెస్‌

జగిత్యాల్‌, డిసెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే మీడియా తోడు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమీషన్‌ మాజీ కమీషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు చట్టం, అవినీతి నిర్మూలన, పౌర, మానవ హక్కుల స్వచ్చంద సంస్థ) శనివారం జగిత్యాలలోని పద్మనాయక మినీ పంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాడభూషి శ్రీధర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

75 ఏండ్ల క్రితం 1947లో మనం సాధించుకున్న స్వాతంత్య్రం, 1950లో అమలైన భారత రాజ్యాంగం బ్రతకాలంటే 16 ఏండ్ల క్రితం వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని భారతీయ పౌరులందరూ ఉపయోగించాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగం బ్రతికితేనే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. ఇందు కోసం ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా బాగా సపోర్ట్‌ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నారు.

స.హ.చట్టం కార్యకర్తలు అందరూ సమాజ ఉపయోగం కోసం పోరాటం చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ పథకం పైన ఆర్టీఐ వేయవచ్చునని సూచించారు. ఆర్టీఐ ద్వారానే ఒక మహిళ తన భర్త ఆచూకిని కనుగొన్నదని వివరించారు. ఆర్టీఐ కార్యకర్తలు ఎంత చైతన్యం అయితే ప్రభుత్వం అంత బాగా నడుస్తోందన్నారు. సభలో హాజరైన సభ్యులు అడిగిన సందేహాలకు తగిన సమాధానం, సలహాలు అందజేశారు.

తెలంగాణ పోలీస్‌ అకాడమీ గెస్ట్‌ లెక్చరర్‌ డి.రజిత మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంపై, చట్టంలోని సెక్షన్లపై అవగాహన కల్పించారు. పలువురు ఆడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పి సమాచార హక్కు చట్టంపై చైతన్య పరిచారు. ప్రముఖ హై కోర్టు న్యాయవాది ఏన్నంపెల్లి గంగాధర్‌, సురేష్‌ కొంపెళ్లి మాట్లాడుతూ చట్టాలపై, ఆర్టీఐ అప్పీలు, కోర్టులో కేసులు, వాటి తీర్పులపై అవగాహన కల్పించారు. జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు టి.సురేందర్‌ మాట్లాడుతూ సిసిఆర్‌ సంస్థ సేవలు మరువలేనివన్నారు. సంస్థ జగిత్యాలలో ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.

జగిత్యాల బార్‌ అసోసియేషన్‌, లీగల్‌ సెల్‌ ద్వారా సిసిఆర్‌ సంస్థకు అండగా ఉండి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మాడభూషి శ్రీధర్‌ వెంటనే స్పందించి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీఐ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని అలాంటి కార్యకర్తలను మీ బార్‌ అసోసియేషన్‌ ద్వారా ఉచిత సేవలు అందజేసి ఆదుకోవాలని సూచించారు.

సభాధ్యక్షులు మంచికట్ల అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ సిసిఆర్‌ సంస్థ సేవలు, భవిష్యత్‌ కార్యాచరణ, జాతీయ స్థాయిలో సంస్థ విస్తరణ, సభ్యుల సేవలు, బాధ్యతల గురించి వివరించారు. అనంతరం సిసిఆర్‌ వెబ్‌సైట్‌ను కేంద్ర సమాచార మాజీ కమీషనర్‌ మాడభూషి శ్రీధర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. సిసిఆర్‌ సంస్థలో కొత్త సభ్యత్వ నమోదు చేపట్టారు. పాత సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు.

ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడి విజయం సాధించిన స.హ.చట్టం కార్యకర్తలకు సత్కారం చేశారు. అవార్డులు రివార్డులు పొందిన వారికి ప్రత్యేక సన్మానం చేశారు. స.హ. చట్టం పై ప్రజలకు, కార్యకర్తలకు అవగాహన కల్పించి, చేదోడు వాదోడుగా ఉండి వార్తా కథనాలను ప్రచురించి, ఎంతో చైతన్యాన్ని రగిలించిన జర్నలిస్టు మిత్రులకు కూడా ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన నిధుల సద్వినియోగం, అవినీతి నిర్మూలన, రైతు, కార్మిక సమస్యలు, ఐకెపి, ఇతర వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరిగిన ఇంకా కూడా జరుగుతున్న దోపిడీ వంటి సమస్యలపై ప్రత్యేకంగా సదస్సులో అవగాహన కల్పించారు. తగు న్యాయ పోరాట నిర్ణయాలు చేపట్టారు. సమావేశంలో సిటిఐ పౌండర్‌ రోహిత్‌ వక్రాల, సిసిఆర్‌ సంస్థ జగిత్యాల జిల్లా కన్వీనర్‌ అయిల్నేని శ్రీనివాసరావు, తెలంగాణ జోనల్‌ సెక్రటరీ చుక్క గంగారెడ్డి, వేణుగోపాల్‌ , సిసిఆర్‌ సంస్థ ప్రతినిధులు ఏనుగు సాయిరాజ్‌, భూక్య చరణ్‌ కాంత్‌, చిన్నా రెడ్డి, భూక్య రాజేష్‌, మ్యాడం జలందర్‌, కాసారపు శేఖర్‌ గౌడ్‌, పాలెపు రాజశేఖర్‌, తిరుపతి రెడ్డి, నక్క చంద్రమౌళి, ఏలేశ్వరం గౌరీశంకర్‌, జగిత్యాల జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ఆర్టీఐ కార్యకర్తలు, సమాజ సేవకులు, మహిళా సంఘాల వారు, కార్మిక, కర్షక (రైతు), ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల వారు, హక్కుల సంఘాల వారు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యావంతులు, నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, అంగన్‌ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎమ్‌లు, యువతీయువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »