నిజామాబాద్, డిసెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఫారం 7, 8, 8ఏ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఎస్‌ఎస్‌ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) పరిశీలకులు విజయ్ కుమార్ తెలిపారు.
ఓటర్లుగా ప్రత్యేక నమోదు కార్యక్రమం పరిశీలనలో భాగంగా ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి రెండవ సారి పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు వచ్చారు. కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌లతో వివరాల నమోదుపై మాట్లాడారు. జిల్లాలో 1 జనవరి 2022 సంవత్సరం వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించుటకు బిఎల్‌వోల నుండి జిల్లా అధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
కొత్తగా నమోదుకు ఫారం 6 తో పాటు పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గం మార్పులకు ఫారం 7, 8 ద్వారా సంబంధిత ప్రజల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా ఎటువంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి శ్రద్ధ చూపాలని అధికారులను కోరారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1.11.2021 న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రచురించడం జరిగిందని, క్లెయిమ్స్ తీసుకోవడానికి నవంబర్ నెలలో 6, 7, 27, 28 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినందున తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్లెయిమ్స్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకొనుటకు ఇప్పటికే బిఎల్‌వోలను ఆదేశించామని కలెక్టర్ ఆయనకు వివరించారు.