కామారెడ్డి, డిసెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రామానుజన్ భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు అని ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడిరదన్నారు. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు అని ఆ వయసులోనే ఎస్‌ఎల్‌లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడని ప్రశంసించారు.
పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడన్నారు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించిందన్నారు.
భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసిందని, 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారన్నారు. 125వ జయంతి సందర్భంగా 2014ను భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించిందన్నారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు కొమ్మ రాజుల శ్రీనివాస్, మోతే లావణ్య, ధన్నారపు రామకృష్ణ, మోతే భాస్కర్ రెడ్డి, నరసింహ చారి, రాములు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.