నిజామాబాద్, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని తెలిపారు. భగవంతుని దయవల్ల ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురిసినందున పాడిపంటలకు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నదని, ప్రజలు డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడానికి ఆలోచించాలని, మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నామన్నారు.
గడిచిపోతున్న 2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి వల్ల చాలా కుటుంబాలు డిస్టర్బ్ అయినాయని, ఎంతో ఆవేదనకు గురైనామని, కొత్త సంవత్సరంలో ఆ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళితే మాస్కులు ధరించాలని, కనీస దూరం పాటించాలని, వ్యాక్సిన్ ఇంకా తీసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పనిసరిగా తీసుకోవాలని ప్రకటనలో వారు కోరారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆశిస్తున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా కూడా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.