ఆర్మూర్, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిఓ 317 ను రద్దు చేయాలని కోరుతూ ఆర్మూర్ ఎంఆర్‌వో కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ ఎమ్మార్వోకి డిమాండ్లతో కూడిన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న సకల జనులు సకల ఇబ్బందులు పడి తెలంగాణ సాధించుకుని బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం అన్న ఆశలతో, ఆశయాలతో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిజాం పాలకుల కన్నా, ఆంధ్ర పాలకుల కన్నా నీచంగా వ్యవహరిస్తూ అన్ని రకాలుగా సకల జనులను ఇబ్బంది పెట్టుకునే కార్యక్రమం చేపట్టినట్లుగా ఉందని అన్నారు.
ఒకవైపు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు, మరోవైపు జీవో 317 కారణంగా ఉపాధ్యాయులు మానసిక క్షోభను అనుభవిస్తూ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం తీవ్రదిగ్భ్రాంతి కలిగించే విషయమన్నారు. మరి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిస్థితులను కల్పిస్తున్నారా అని బిజెపి ప్రశ్నిస్తుందన్నారు.
జిఓ 317 కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే గతంలో వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంకోసం ఉద్యమించినందుకు మరి వీరికి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తున్నదా..? అని బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు సైతం ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నయా అన్నట్లుగా స్పందించకపోవడం విచారకరమన్నారు.
వెంటనే జీవో 317 ను రద్దు చేయాలని లేనట్లయితే ఏ సకలజనుల ద్వారా తెలంగాణను సాధించుకున్నామో ఆ సకల జనులతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోరి కట్టే సమయం ఎంతో కాలం లేదని హెచ్చరించారు.
కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, ఉపాధ్యక్షులు ధోండి ప్రకాష్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్సింగ్ నాయక్, ఉపాధ్యక్షులు గూగుల్ తిరుపతి నాయక్, బీజేవైయం పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మిరియాల్‌కర్ కిరణ్, బిజెపి వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.