కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర ఎస్సి డెవలప్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ విజయ్ కుమార్ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయడం వల్ల వినియోగదారులు గిట్టుబాటు ధర చెల్లించి కూరగాయలు కొనుగోలు చేస్తారని చెప్పారు. సేంద్రీయ పద్ధతిలో పండిరచిన కూరగాయలు తినడం వల్ల వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతుల కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ విధానం ద్వారా కూరగాయల సాగు చేపట్టాలని కోరారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయలను పండిరచవచ్చునని సూచించారు. తప్పనిసరిగా రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని కోరారు. విత్తన శుద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. శివాయిపల్లి లో రైతు గురువారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో తీగ జాతి కూరగాయల పందిరి విధానంలో పండిరచిన కాకర పంట పరిశీలించారు. సమావేశంలో సర్పంచ్ విట్టల్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి సంజీవ రావు, ఎంపీపీ స్వరూప, జడ్పిటిసి సభ్యులు హనుమాన్లు, ఉద్యానవన శాఖ అధికారులు రాజు, స్వరూప్ కుమార్, రైతులు పాల్గొన్నారు.