నిజామాబాద్, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుకు పెట్టుబడి సబ్సిడీ కింద అందించే రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసాగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు సంబరాలలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన రైతు బందు సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు ద్వారా వానాకాలం యాసంగి ప్రతి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయాన్ని అందించిన మొట్టమొదటి పథకం రైతు బంధు అన్నారు. పంటల సాగుకు రైతులకు కావలసినవి కొనడానికి రైతు బంధు పథకం నమ్మకం కలిగిస్తుందని, రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులు కొనే విధంగా ప్రభుత్వం ముందే అడ్వాన్స్‌గా రైతు ఖాతాలలో నేరుగా డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. మన జిల్లాలో ఈరోజు వరకు సుమారుగా 2 లక్షల 60 వేల మంది రైతులకు రైతుబంధు సహాయాన్ని సుమారుగా ఈరోజు వరకు 2 వందల 15 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. జమ చేసిన సమాచారం రైతుల ఫోన్‌కు మెసేజ్ వస్తుందన్నారు.
ఒకప్పుడు విత్తనాలు, ఎరువులు కొనడం కోసం రైతులు అధిక వడ్డీకి అప్పులు చేసేవారు, 2014-15 నిజామాబాద్ ప్రాంతంలో పండే వరి ఉమ్మడి నిజామాబాద్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, నిజామాబాద్ కొత్త జిల్లాలో యాసంగి పండిరచిన పంట ప్రభుత్వం కొన్నది 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులని, రెండు జిల్లాలను కలిపితే సుమారుగా 11 నుండి 12 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు పండిస్తున్నారన్నారు.
రైతులు పండిరచే పంట 2:50 నుండి మూడు రెట్లు పెరిగింది అన్నారు. అవసరమైన సాగునీరు, 24 గంటల కరెంటు చాలా వరకు రైతు కోణంలో ఆలోచించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ధరణిలో ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని ఇప్పటికీ 95 శాతం భూములు క్లియర్ అయిందని, ఆరు నెలల్లో మొత్తం పూర్తి అవుతుందన్నారు.
తెలంగాణలో భూమి ఉంటే ఒక ఇంటికి భరోసా అని, ఒక ఆడ బిడ్డ తండ్రికి దైర్యం, నమ్మకం, ఆర్థికం అన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలు వేసి మంచి ధర వచ్చే విధంగా అమ్ముకోవాలి అన్నారు. నాలుగు నెలలు కష్టపడి పండిరచిన పంట హ్యాపీగా అమ్ముడు పోవాలని, రైతులకు ఇబ్బంది రాకూడదన్నారు. రైతులు అభివృద్ధి పథంలో నడవాలని, రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రైతే రాజు అన్న నానుడి వాస్తవంగా రైతే రాజు అనే పరిస్థితి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. ఈ సందర్భంగా నిమ్మల రాజారెడ్డి, అంక్సాపూర్ మోహన్ రెడ్డి, మగ్గిడి చిన్నారెడ్డి, గంగుల చిన్న లింగన్న, ప్రాస దేవన్నలను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మార్కెట్ కమిటీ సెక్రెటరీ వెంకటేష్, ఈగ గంగారెడ్డి రైతులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.