డిచ్‌పల్లి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఆకుల శ్రీనివాస్‌కు పిహెచ్.డి. డాక్టరేట్ అవార్డు ప్రకటించారు. అందుకు సంబంధించిన పిహెచ్.డి. వైవా వోస్ (మౌఖిక పరీక్ష) గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సెమినార్ హాల్‌లో జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల సమస్యలు, సమర్ధవంతమైన పరిష్కారాలు అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు డా. అక్కేనపల్లి పున్నయ్య పర్యవేక్షణలో ఆకుల శ్రీనివాస్ పరిశోధించిన సిద్ధాంత గ్రంధానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్ విభాగంలోని సీనియర్ ఆచార్యులు బి.సుధాకర్ రెడ్డి ఎక్సటర్నల్ ఎక్సమినర్‌గా ఓపెన్ వైవా నిర్వహించారు.
పరిశోధక విద్యార్థి ఆకుల.శ్రీనివాస్ యాదాద్రి బోనగిరి జిల్లాలో మారుమూల గ్రామీణ ప్రాంతంలో, వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తాను వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాద్యాయుడు అయినందున వ్యవసాయ రంగంలోని కూలీల ఆర్థిక సమస్యలకు దగ్గరగా అర్ధం చేసుకున్నాడు. ఈ సమస్యలకు సమర్ధవంతమైన పరిష్కారాలను కనుగొనుటకు ఆధునిక పద్దతులను అనుసరించి రూపొందించుకున్న ప్రశ్నావళి ద్వారా కారణాలను బయటకు తీసి సరిjైున గణాంక పద్దతుల ద్వారా పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదించడం అభిందనీయమని ఆచార్యులు బి.సుధాకర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య. కే శివశంకర్ పరిశోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి క్షేత్ర స్థాయిలో జరిగే నిర్దిష్ట పరిశోధనల అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసి ఆకుల శ్రీనివాస్‌ను అభినందించారు. వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం పనిదినాలు పెంచి ఉపాధిహామీలాంటి పథకాలను కూడా వ్యవసాయ కూలీల పనులకు వర్తింప చేసి గ్రామీణ కూలీల ఇబ్బందులను తలగించాలన్నా ఈ సిద్ధాంత గ్రంధం ప్రభుత్వ విధాన నిర్ణయాలకు దీక్సుచిగా ఉపయోగపడుతుందని తెలిపారు.
దృఢ సంకల్పంతో క్షేత్ర స్థాయిలో జరిగే ఇలాంటి పరిశోధనలు రాష్ట్ర అభివృద్ధికి లోతైన అడుగులు వేస్తాయని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన పరిశోధనల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓపెన్ వైవాకు విభాగాధిపతి డా. టి. సంపత్ అధ్యక్షత వహించగా, ఆచార్యులు డా . నాగరాజు పాత, కే . రవీందర్ రెడ్డి, డా.బి.వెంకటేశ్వర్లు, డా స్వప్న, డా. సి. హెచ్. శ్రీనివాస్, డా. వి. దత్తహరి పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.