బోధన్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్, సిఐటియు జిల్లా నాయకులు జే. శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బి. మల్లేష్, జే. శంకర్ గౌడ్ మాట్లాడుతూ పెరిగిన వేతనాలు ఆహ్వానిస్తూనే ఇంకా మిగిలిన కార్మికుల డిమాండ్ల సాధనకై ఇదే స్ఫూర్తితో పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. పిఆర్‌సిలో అతి తక్కువ కింది స్థాయి వేతనం 19 వేలు అని ప్రకటించి, దానిపైన 30 శాతం వేతనం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం కార్మికుల వేతనాలను పెంచకపోవడం విచారకరమన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ కార్మికుల అందరిని పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మిగిలిన డిమాండ్ల సాధనకై ఇదే స్ఫూర్తితో పోరాడుతామని కార్మికులకు పిలుపునిచ్చారు.