కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట మండల తాసిల్దార్ జానకి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ జానకి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాల స్థాయిలో ఇలాంటి పండుగ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం వల్ల భావితరాలకు పండగలు సాంప్రదాయాలు కాపాడిన వాళ్ళం అవుతామని అన్నారు. ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు.
అన్ని హంగులతో కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను సుందరీకరణ చేయడం, పాఠశాల ఆవరణలో మంచి ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన వాతావరణం పిల్లలకు మంచి ఆక్సిజన్ అందించడానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావును అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి, ఉప సర్పంచ్ చాకలి బాలయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, వార్డ్ మెంబర్ సంతోష్, ఉపాధ్యాయురాలు అంగన్‌వాడి టీచర్ స్వరూప, అనురాధ, విద్యా వాలంటీర్లు రోజా, భాగ్య, వీఆర్‌ఏలు సిద్ధరాములు, సాయిలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.