నిజామాబాద్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్ 317 వెనక్కి తీసుకోవాలని గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భీంగల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ విప్ అనిల్, రైతు నాయకులు అన్వేష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నీ రెడ్డి భాగ్యను అరెస్టు చేసి కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టయిన నాయకులను ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా నాయకులు సత్యనారాయణ, సురేష్‌లు కలిసి సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వి.ప్రభాకర్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగ బదిలీల విషయంలో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నదన్నారు. కనీసం ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదన్నారు.
జీవో నెంబర్ 317 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బదిలీలపై ఆవేదనతో జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఉపాధ్యాయిని సరస్వతి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.