కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 201, 206, 211 సర్వే నెంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించిన మున్సిపల్ అధికారులను దాని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేశాయి. ప్రజాప్రతినిధులు అయి ఉండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించడం సిగ్గుచేటన్నారు.
స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. సర్వే చేసిన అధికారులే స్వయంగా వచ్చి కళాశాల స్థలంలోనే గోడను నిర్మించడం జరిగిందని తేల్చి చెప్పడం జరిగిందని, కామారెడ్డి మున్సిపల్ అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించడానికి ఏ రకంగా అనుమతినిచ్చారో చెప్పాలన్నారు.
ప్రజాప్రతినిధులు అయి ఉండి డిగ్రీ కళాశాల భూములను కాపాడాల్సింది పోయి గోడ నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు. వెంటనే డిగ్రీ కళాశాల భూములను అన్యాక్రాంతం కాకుండా ప్రవారి గోడను నిర్మించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తే కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి బెదిరింపులను మానుకోవాలని, బెదిరింపులకు విద్యార్థి సంఘాలు భయపడవని, ముఖ్యమంత్రిని నిలదీసిన చరిత్ర కామారెడ్డి విద్యార్థి సంఘాలకు ఉందని ఆ విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.
కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, ఓసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అంజల్ రెడ్డి, రాజు, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.