నిజామాబాద్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చిలోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన పెషీ చాంబర్ నుంచి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిఆర్‌డిఓ, డిపిఓ, ఎంపిడీఓలు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా 3వ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి పారిశుద్ధ్యంపై రాజీ లేకుండా, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా, ఉధృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్యాన్ని కొనసాగించాలని, గత కరోనా సీజన్లలో పంచాయతీ సిబ్బంది, అధికారుల పనితీరు అద్భుతంగా ఉందని, ఆ ఫ్రంట్ వారియర్ స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి సూచించారు. మొదటి విడత వ్యాక్సినేషన్లలో రాష్ట్రం వందకు వంద శాతం సక్సెస్ సాధించిందని, రెండో విడత కూడా పూర్తి చేయాలని చెప్పారు. అలాగే, బూస్టర్ డోస్‌లను కూడా పర్యవేక్షిస్తూ, సిఎం కెసిఆర్ ఆలోచనా విధానమైన ఆరోగ్య తెలంగాణ సాధనలో మన శాఖ ముందుండాలని ఆకాంక్షించారు.
పరిశుభ్రతను పాటించాలని, ప్రజల్ని చైతన్యం చేయాలన్నారు. ట్రాక్టర్, ట్రాలీలతో చెత్త సేకరణ ప్రతి నిత్యం జరగాలని, డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తలను వేరు చేసి, ఎరువుల తయారీ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. ప్రతి రోజూ గ్రామ కార్యదర్శులు 7 గంటల కల్లా విధుల్లో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వంద శాతం వైకుంఠ ధామాలు పూర్తి చేయడం అభినందనీయమని, అయితే వాటన్నింటినీ ఆచరణలోకి తేవాలని అన్నారు.
పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల స్థలాలు ఎక్కడైనా గుర్తించకపోయి ఉంటే వెంటనే గుర్తించాలని సూచించారు. సిఎం కెసిఆర్ ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ప్రజలను ఆరోగ్యంగా ఉంచడానికి, వాకింగ్ ట్రాక్స్‌గా ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేబర్ మొబిలైజేషన్, కొత్త కార్డుల జారీ అంశాలను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
కరోనా నేపథ్యంలో నగరాల ప్రజలు పల్లెబాట పడుతున్నారని అలాంటి వాళ్ళందరికీ ఉపాధి లభించేలా చూడటం మన బాధ్యత అని మంత్రి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచమంతా భయబ్రాంతులకు గురైనప్పటికీ మనం ఆ తీవ్రతను చాలా వరకు తగ్గించుకోగలిగామన్నారు. దేశంలో ఒకప్పుడు గంగదేవి పల్లెను ఆదర్శంగా అంతా చూసేవారు, ఈ రోజు పల్లె ప్రగతితో ప్రతి పల్లె ఓ ఆదర్శ గంగదేవి పల్లెకు మించి అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ఇది సిఎం కెసిఆర్ దార్శనికత. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బంగారు తెలంగాణలో భాగంగా మనం, ఆరోగ్య ఆదర్శవంతమైన పల్లెలను నిర్మించే పనిని మరింత శ్రద్ధతో నిర్వర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా మాట్లాడుతూ నిర్దేశించిన లక్షల ప్రకారం అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయుటకు తీసుకుంటున్నామని మంత్రికి వివరించారు. జిల్లా పరిషత్ సీఈవో గోవిందు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డిఆర్‌డిఓ పిడి చందర్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.