కామారెడ్డి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27న మండల స్థాయిలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి సభ్యులు అర్హత సాధిస్తారని చెప్పారు.
మండల స్థాయిలో పదిమంది సభ్యులను ఎన్నుకున్న తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఇద్దరు సభ్యులను డివిజన్ లెవెల్ మేనేజ్మెంట్ కమిటీకి పంపవలసి ఉంటుందని పేర్కొన్నారు. 28న డివిజన్ స్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 29న జిల్లాస్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
ఎన్నికలను శాంతియుతంగా జరపాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. సమావేశంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, కామారెడ్డి చైర్మన్ రాజన్న, ఆర్డివోలు శీను, రాజా గౌడ్, జిల్లా పరిషత్ సీఈవో సాయా గౌడ్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.