నిజామాబాద్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో పకడ్బందీగా అమలు చేయాలని, ఎవరైనా తమ పనితీరును మార్చుకోకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. హరితహారంను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాదు గ్రామీణం, మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని చింతకుంట, వకీల్‌ఫారమ్, అఫన్దిఫారం, శ్రీనగర్, వర్ని సత్యనారాయణపురం తదితర గ్రామాలలో, వాటి శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దారి పొడుగునా రోడ్డుకు ఇరువైపులా హరిత హారం కింద నాటిన మొక్కలను కలెక్టర్ కాలినడకన నడుస్తూ ఒక్కో మొక్క వారీగా పరిశీలన జరిపారు.
మొక్కల ఎదుగుదల, వాటి సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలను క్షేత్ర స్థాయిలో గమనించారు. అక్కడక్కడా లోపాలను పరిశీలించి స్థానిక అధికారులకు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. మోస్రా, చందూర్ మండలాల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడం, వాటిని కాపాడేందుకు సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడాన్ని గమనించిన కలెక్టర్ అక్కడి అధికారులను అభినందించారు. మరింత శ్రద్దాసక్తులతో పని చేయాలని, వచ్చే ఆరు మాసాల పాటు మొక్కలను కాపాడుకోగలిగితే వాటిని పూర్తిగా సంరక్షించుకోగలుగుతామని పేర్కొన్నారు.
అయితే నిజామాబాదు రూరల్, వర్ని మండలాల పరిధిలో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ విషయంలో అలసత్వం తగదని పదేపదే సూచిస్తున్నప్పటికీ, పలువురి ప్రవర్తనలో మార్పు రాలేకపోతోందని అసహనం వెలిబుచ్చారు. ఇకపై సూచనలు చేయడం ఉండదని, పనితీరు మార్చుకోని వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని కరాఖండిగా తేల్చి చెప్పారు.
తాను మరో వారం పది రోజుల్లో మళ్ళీ ఆకస్మిక తనిఖీ కోసం వస్తానని, అప్పటి వరకు లోపాలను సరి చేసుకోవాలన్నారు. తన తదుపరి తనిఖీలో ఎక్కడైనా మొక్కల పెంపకం, నిర్వహణలో లోపాలు కనిపిస్తే క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ఎవరినీ ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న పనిని కూడా చేయకపోతే విధుల్లో కొనసాగడం ఎందుకు అని నిలదీశారు. పదేపదే చెప్పించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకుండా నాణ్యత కనిపించేలా, అంకిత భావంతో పని చేయాలన్నారు.
మొక్కల సంరక్షణ కోసం వాటి చుట్టూ ట్రీ గార్డులను సరైన సపోర్ట్‌తో ఏర్పాటు చేయాలని, మొక్క చుట్టూ నీరు కనీసం 12 నుండి 20 లీటర్ల మేర నిలిచి ఉండేలా చుట్టూ గుంత తవ్వించాలని, అవసరమైన చోట మొక్కలకు ఎరువు అందేలా జాగ్రత్తలు సూచించారు. ఎక్కడైనా ఏ ఒక్క మొక్క కూడా పాడైతే అందుకు గల కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు హితవు పలికారు.
వైకుంఠ ధామాల వద్ద కూడా పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌పై మరింత శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి 400 మొక్కలకు ఒకరి చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేస్తూ, నిర్వహణ పరమైన లోపాలకు ఎంతమాత్రం అవకాశం కల్పించవద్దని సూచించారు.
కాగా, వర్ని సత్యనారాయణపురం ఆర్టీసీ బస్టాండుకు ఆనుకుని ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంను కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వర్ని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ఆయా విభాగాల పనితీరు గురించి తహసీల్దార్ విఠల్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయం ఆవరణలో పెంచిన మొక్కలను, అక్కడ ఉన్న రెయిన్ గేజ్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల ఎంపిడివోలు భారతి, నీలావతి, బషీరుద్దీన్‌తో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు వున్నారు.