నిజామాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్ గ్రామ శివార్లలోని నిజామాబాదు హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్ బ్యాంకులు, మార్బల్ షాప్స్ తదితర దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలను గమనించిన కలెక్టర్ వాటి ఆవరణలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటించాలని అధికారులకు సూచించారు. పలు వ్యాపార సంస్థల నిర్వాహకులను తన వద్దకు పిలిపించుకుని మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత గురించి వారికి వివరించారు.
వచ్చే నాలుగైదు రోజులలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. కావాల్సిన మొక్కలను తామే సమకూరుస్తామని, వాటిని క్రమ పద్దతిలో నాటి ఏ ఒక్క మొక్క కూడా పాడవకుండా నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా చేయాలన్నారు. దీనివల్ల ప్రధాన మార్గం గుండా రాకపోకలు సాగించే వారికి ఆయా ప్రాంతాలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తాయని, కాలుష్య నివారణకు కూడా మొక్కలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు వచ్చిపోయే మార్గాన్ని మినహాయించి మిగతా ఖాళీ ప్రదేశంలో ఇరువైపులా కనీసం 50 చొప్పున మొక్కలు నాటాలన్నారు. పెట్రోల్ బంకులకు అనుమతి ఇచ్చే సమయంలోనే ఈ నిబంధన విధించడం జరిగిందని, దీనిని పాటించని వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
కాగా, రోడ్డుకు ఇరువైపులా వరుస క్రమంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్థానిక అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా ఒక్కో మొక్క వారీగా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. మొక్కలను పశువులు తినకుండా తప్పనిసరిగా వాటిచుట్టూ ట్రీగార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.