జిల్లాలో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో అత్యధికంగా 61 కేసులు నమోదయినప్పటికి, అతి తక్కువ సమయంలో కరోనాను కట్టడి చేయగలిగామని జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి మధుసూదన్ రాంవు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ మూడవ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ హాలులో జరిగింది.కరోనా వల్ల సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆలస్యం అయిందన్నారు. సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన జిల్లా కలెక్టర్, వారి యంత్రాంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా తమవంతు సహకారం అందిస్తూ కరోనా కట్టడికి, ధాన్యం సేకరణలో తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల కరోనా కట్టడి చేయగలిగామని, ఇప్పుడు లాక్ డౌన్ సడలించడం, అంతర్రాష్ట్ర ప్రయాణాలను అనుమతించినందున పైగా వర్షాకాలం ప్రారంభమైనందున, వర్షాకాలంలో సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు వంటి జబ్బులవల్ల కరోనా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నవంబర్-డిసెంబర్ వరకు వాక్సిన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, శానిటీజర్లు వాడుతూ, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుండి ఇప్పటి వరకు 6 వేల 500 మంది రాష్ట్రానికి వచ్చారని అందులో 2 వేల 700 మంది కరోనా ఎక్కువగా వున్న మహారాష్ట్ర నుండి వచ్చారని, ప్రజలను కాపాడే బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులందరిదని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే కరోనా జాగ్రత్త చర్యలు తీసుకునేలా చూడాలని, ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, 10 సంవత్సరాల లోపు 65 సంవత్సరాలు పైబడ్డ వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్ 95 మాస్కులు రిస్క్ జోన్‌లో మాత్రమే వాడాలని, వీటిని ఎల్లప్పుడూ వాడడం వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి క్లాత్ మాస్కులు వాడాలని సూచించారు.సమావేశానికి ఎమ్మెల్సీలు వి.జి.గౌడ్, ఆకుల లలిత, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.