కోవిడ్‌ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలి

కామారెడ్డి, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్‌ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్‌, ఏ.ఎన్‌.ఎం, మున్సిపల్‌, గ్రామ పంచాయతి సిబ్బందితో టీం ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలని, కోవిడ్‌ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ ఇవ్వాలని సూచించారు.

ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ఐసోలేషన్‌ కిట్‌ ఇచ్చిన వారిని సర్వే టింలు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. గత అనుభవంతో ఇంటింటి సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.

మొదటి డోస్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా 90శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లు చెప్పారు. రెండోవ డోసు 70 శాతం అయ్యిందని చెప్పారు. 15 నుండి 17 సంవత్సరముల వారికి మొదటి డోస్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్‌ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అందరికి బూస్టర్‌ డోస్‌ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్‌, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్‌ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు.

కోవిడ్‌ లక్షణాలున్న వారందరికి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందజేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌, హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ సౌకర్యంతో కోవిడ్‌ వార్డులను ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్లు, పోలీస్‌ సూపరింటెండెంట్లు ప్రజలందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర పంచాయతి రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్‌ ఆఫిసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా, ఏ.ఎన్‌.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇంతవరకు కోవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌ గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎగ్జిగ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు ఉన్నాయని అన్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్‌ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్‌ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. శుక్రవారం నుంచి జిల్లాలో ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలకు కోవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రం ఉందని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ వినియోగంలో ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌ ఎక్స్గ్రేషియా కోసం 606 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.

470 మంది దరఖాస్తులను ఇప్పటివరకు పరిశీలించి పరిష్కారం చేసినట్లు చెప్పారు. 136 దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయని, రెండు రోజుల్లో వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ కల్పనా కంటే, జిల్లా పంచాయతి అధికారి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »