నిజామాబాద్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొనగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధు, దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకమని అన్నారు. దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు పథకం సత్ఫలితాలతో దళితులు అభివృద్ధిబాటలో పయనిస్తున్నారు అని తెలిపారు.
ఈ క్రమంలో ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయుటకు నిర్ణయించారనీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో మొదటిదశలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధు పథకం అమలు చేస్తామని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు సమావేశాలు పెట్టుకొని ఫిబ్రవరి 5 లోపు ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, మార్చి 7లోపు యూనిట్ల గ్రౌండ్ పూర్తి చేసి దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని అన్నారు.
దళితబంధుతో నిరుపేద షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరముందని, జిల్లాలలో దళితబందు అమలుకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లోని అర్హులైన దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం అమలవుతుందని తెలిపారు. మార్చి 7వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక చేసుకున్న యూనిట్లను కలెక్టర్లు గ్రౌండిరగ్ చేయాలని అన్నారు. దళిత బంధు పథకం అమలుకు నిధులు అన్ని జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోనీ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరవడం, జాబితాలు సిద్ధం చేయడం యూనిట్లను గ్రౌండిరగ్ చేయడం తదితర అంశాలపై సి.ఎస్ సమీక్షించారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బందు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారులు, ప్రత్యేక అధికారులకు ముందుగానే స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. 2021 ఆగస్ట్ 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకం ఫలాలు దళితులు అందుకుంటున్నారని తెలిపారు.
దళిత బంధు పథకం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రమంతా దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రాలు మాట్లాడుతూ, జిల్లాలో 5 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరవడం, జాబితాలు సిద్ధం చేయడం, సకాలంలో యూనిట్లు గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.