కామారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో శనివారం కరోనా నియంత్రణ, దళిత బంధు అమలుపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు మొదటి విడత డోసులు 92 శాతం, రెండో విడత డోసులు 69 శాతం వేసినట్లు మంత్రి చెప్పారు.
జిల్లాలో 2.10 లక్షల గృహాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో జ్వరం సర్వే ద్వారా 1.12 లక్షల గృహాలను సర్వే చేసినట్లు చెప్పారు. లక్షణాలున్నవారిని సర్వే బృందాలు గుర్తించి మందుల కిట్లను అందజేసినట్లు చెప్పారు. మూడు రోజుల్లో జిల్లాలో సర్వేను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 337 కొవిడ్ రోగుల కోసం బెడ్లు సిద్ధంగా ఉన్నాయని సూచించారు.
ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరారు. మొదటి, రెండో విడత కరోనా నేపథ్యంలో శాసనసభ్యులు, అధికారులు, వైద్య సిబ్బంది సమిష్టిగా కృషి చేయడం వల్ల కరోనా నుంచి తక్కువ నష్టంతో బయటకు వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉందని, ధైర్యంగా ఉండాలని, భయపడవలసిన పనిలేదని సూచించారు. లక్షణాలు ఉన్నవారు ఐదు రోజులు క్రమం తప్పకుండా మందులు వాడాలని పేర్కొన్నారు.
వ్యాధి తగ్గకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళితులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు వారికి అవసరమైన యూనిట్లను ఎంపిక చేసి వివరాలు తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో 350 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు జిల్లాకు వస్తాయని తెలిపారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, ప్రభుత్వ విప్ గోవర్ధన్, జుక్కల్ శాసన సభ్యుడు హనుంత్ షిండే, డిసిసిబి అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూ ప్రియా, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.