డిచ్‌పల్లి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో డైరెక్టర్ డా. కె. అపర్ణ సోమవారం సాయంత్రం వర్చువల్ వేదికగా ఆన్‌లైన్ లో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయ మహిళా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో చాలా మంది విద్యార్థులు చిత్రాలు గీసి ఆన్‌లైన్‌లో ప్రదర్శించారు.
అందులో హరిప్రియ, యోగిత, ద్యాగలి సాత్త్విక, ఎస్. భవ్య తదితరులు చిత్రలేఖనంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. విభిన్న రంగాలలో కృషి చేస్తున్న మహిళల శక్తి సామర్థ్యాల గురించి, భ్రూణ హత్యల ఖండన గురించి, బాలికా సంరక్షణ గురించి, స్త్రీ విద్యా వ్యాప్తి గురించి వివరించే అనేక అంశాలను విద్యార్థులు తమ చిత్రలేఖనంలో తెలిపారు. మహిళా విద్యార్థులలో సృజనాత్మక కళను వెలికి తీసే కార్యక్రమాలను నిర్వహిస్తున్న డైరెక్టర్ డా. కె. అపర్ణను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు.