నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాదు కలెక్టరేటులో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్ గౌడ్, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు తదితర ప్రముఖులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు హంగు ఆర్భాటాలకు తావు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలను కలెక్టరేట్ ఆవరణలో జరుపుకున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అధికారులు, పుర ప్రముఖులను అనుమతించారు.
వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రిపబ్లిక్ డే ఉత్సవాలను ఆర్భాటాలకు తావు లేకుండా సాదాసీదాగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అయినప్పటికీ గుండె నిండా జాతీయ భావాన్ని నింపుకుని ఎంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు.
ఏ ఉద్దేశ్యంతోనైతే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందో, దానికి అనుగుణంగానే ప్రతి కుటుంబానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం అహరహం కృషి చేస్తోందని అన్నారు. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ అభిమతమని కలెక్టర్ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ స్ఫూర్తిని దశదిశలా వ్యాపింపజేస్తూ, రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయి వరకు అందరికి అందేలా కృషి జరుగుతోందని అన్నారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ (ట్రైనీ) మకరంద్, అదనపు డిసిపి (పరిపాలన) డాక్టర్ వినీత్.జీ, డిసిపి అరవింద్ బాబుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, టిఎన్‌జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, పుర ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.