నిజామాబాద్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో దళిత బంధు అమలుకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోగా సమగ్ర నివేదికలు అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతిభవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై దళిత బంధు పథకం యూనిట్ల గుర్తింపు తదితర అంశాలను సమీక్షించారు.
క్షేత్ర స్థాయిలో సర్వే బృందాలు రెండు రోజుల పాటు పర్యటించిన సందర్భంగా వారు గమనించిన అంశాలను, దళిత కుటుంబాల స్థితిగతులు ఎలా వున్నాయి, ఆయా కుటుంబాలు ఏ తరహా ఉపాధి అవకాశాలను కోరుకుంటున్నారు, అత్యధికమంది ఏ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి కనబర్చారు ఇత్యాది విషయాల గురించి కలెక్టర్ సర్వే బృందాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక శాతం మంది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధిని కోరుకుంటున్నారని సర్వేలో తేలిందన్నారు.
ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఫెర్టిలైజర్స్ షాపులు, డెయిరీ, పౌల్ట్రీ వంటి యూనిట్ల స్థాపన కోసం ఆసక్తి చూపుతున్నందున ఆయా శాఖల అధికారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. అదేవిధంగా ఉద్యానవన శాఖా ఆధ్వర్యంలో కూరగాయల సాగు యూనిట్లకు కూడా నివేదిక తయారు చేయాలన్నారు. రవాణా రంగం పై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ గూడ్స్ వెహికల్స్, ఆటో రిక్షా వంటి యూనిట్ల కేటాయింపు కోసం నివేదికలు రూపొందించాలని డీటీసీ వెంకటరమణను ఆదేశించారు. కొత్త తరహా ఆలోచలతో కూడిన యూనిట్లను గుర్తిస్తూ, లబ్ధిదారులకు అనుభవం ఉన్న రంగాలలో యూనిట్లు నెలకొలిపితే పూర్తి స్థాయిలో అవి విజయవంతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
టైలరింగ్, క్లాత్ షాప్స్, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్, ఫోటో స్టూడియోలు, మినీ బజార్లు, మినీ దాల్ మిల్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు వంటి వాటికి కూడా యూనిట్ల స్థాపన జాబితాలో చేర్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో 55 వేల వరకు దళిత కుటుంబాలు ఉన్నాయని, ప్రస్తుతం తొలి విడతగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారని పేర్కొన్నారు.
దీనిని ద ృష్టిలో పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలు, స్థానిక పరిస్థితులు, అత్యధిక కుటుంబాల వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ, యూనిట్ల నెలకొల్పనకై సమగ్ర వివరాలతో ఈ నెల 31 వ తేదీ లోగా నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ (ట్రైనీ) మకరంద్, కాకతీయ సాండ్ బాక్స్ సంస్థ సీఈఓ మనీష్ జైస్వాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.