కామారెడ్డి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకునే విధంగా చూడాలని కోరారు.
ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 97 శాతం మొదటిడోసు, 72 శాతం రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. వైద్యులు, ఆర్‌బిఎస్‌కె సిబ్బంది సహకారంతో అర్హులందరికీ క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు.
15 నుంచి 17 ఏళ్ళ లోపు బాలబాలికలకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారిణి కల్పన కంటే, వైద్యాధికారులు పాల్గొన్నారు.