నిజామాబాద్, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనం పెంపొందిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ ఎంతో కీలకం అని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి నిజామాబాద్ నగరంలోని సాయినగర్, నాగారం, సారంగపూర్, బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు.
బైపాస్ రోడ్డు మార్గంలో మొక్కలు చక్కగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు కూడా ఇదే రీతిలో చొరవ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కల సంరక్షణ విధులు సమర్ధవంతంగా నిర్వర్తించే కూలీలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలన్నారు. నిబంధనలను అనుసరిస్తూ వేతనాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తే కూలీలు సంతృప్తిగా పని చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌తో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 63 ప్రధాన రహదారుల వెంబడి నాటిన మొక్కలు పరిశీలించారు. డిచ్‌పల్లి, బీబీపూర్ తండా, ఇందల్ వాయి, గన్నారం, చంద్రాయన్ పల్లి శివారు ప్రాంతాల్లో మొక్కల స్థితిగతులను నిశిత పరిశీలన జరిపారు. పలుచోట్ల లోటుపాట్లను గమనించి అధికారులకు సూచనలు చేశారు. అటవీ, పంచాయతీ రాజ్, ఉపాధి హామీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు చొరవ చూపాలన్నారు.
వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ పెట్టుకుని ప్రణాళికబద్దంగా ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో మొక్క వారీగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ, పాడైపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. మొక్క చుట్టూ కనీసం 12 లీటర్ల నీరు పట్టేవిధంగా చుట్టూ సాసరింగ్ వుండాలని, మొక్కకు, ట్రీ గార్డుకు సపోర్టుగా బలమైన కర్రను పాతాలని సూచించారు. కూలీలు ఎంతమంది పనికి వస్తున్నారు, ఏ మేరకు పని చేశారు తదితర విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అటవీ, పంచాయతీరాజ్ అధికారులు పనుల వివరాలను పూర్తి స్థాయిలో స్పష్టంగా రిజిస్టర్లో నమోదు చేస్తూ, వాటిపై ఉమ్మడిగా సంతకాలు చేయాలన్నారు.
వర్షాకాలం సీజన్ ప్రారంభం అయ్యేంత వరకు కనీసం మరో నాలుగు నెలల పాటు మొక్కలను కాపాడుకోగలిగితే అవి పూర్తి స్థాయిలో సంరక్షించబడతాయని కలెక్టర్ హితవు పలికారు. హరితహారం మొక్కల చుట్టూ మొలిచిన గడ్డి పొదలు, పిచ్చి మొక్కలు తొలగించి, క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. నాటిన ప్రదేశాల్లోనే మళ్ళీ మళ్ళీ మొక్కలు నాటే పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు.
మనం చేసే పనిని నిబద్ధతతో నిర్వర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయని, నామ్ కె వాస్తే అన్నట్లుగా పై పైన పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. అటవీ, పంచాయతీ రాజ్, ఉపాధి హామీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు చొరవ చూపాలన్నారు. కలెక్టర్ వెంట ఫారెస్ట్ ఆఫీసర్లు, ఆయా మండలాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.