నిజామాబాద్, జనవరి 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్‌లో శనివారం ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశమై ధరణి పెండిరగ్ దరఖాస్తుల విషయమై సమీక్షించారు. ఎన్ని దరఖాస్తులు ఏయే విభాగంలో పెండిరగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికై చేపడుతున్న చర్యలు ఏమిటీ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను ఆయా మండలాల వారీగా తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో మన జిల్లా పలు విభాగాల్లో వెనుకంజలో ఉందని, దరఖాస్తుల పరిష్కారానికి చొరవ చూపుతూ ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్నారు. వచ్చే మంగళవారం నాటికి ఏ ఒక్క పెండిరగ్ దరఖాస్తు మిగిలి ఉండకుండా అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. పట్టాదార్ పాసుబుక్‌ల జారీ కోసం వెలువరించిన ఉత్తర్వులపై ఫిర్యాదుదారుడు అప్పీల్‌కు వెళ్లాడా? లేదా? అన్నది తెలుసుకుని తదనుగుణంగా నిబంధనలను అనుసరిస్తూ ధరణి అర్జీలు పరిష్కరించాలని సూచించారు.
రికార్డులలో ఎవరి పేరు వుంది, మోకా మీద ఎవరు ఉన్నారు, వారసులు ఎవరు, వివాదం నెలకొని ఉన్న భూమిని వారసుల పూర్వీకులు ఇదివరకే ఇతరులకు విక్రయించారా వంటి అంశాలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన జరిపితే చాలా వరకు పెండిరగ్ దరఖాస్తులకు పరిష్కారం చూపవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి సంబంధిత సమస్యతో ముడిపడి ఉన్న దరఖాస్తులను ఆషామాషీగా తీసుకోకూడదని హితవు పలికారు.
ఏవైనా అనుమానాలు, అర్ధం కానీ అంశాలు ఉంటే, తమ పై స్థాయి అధికారులను లేదా కలెక్టరేట్ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. అర్హులైన భూ యజమానులకు ఏ కారణం చేతనైనా పట్టాదార్ పాసుబుక్ అందకపోతే ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తూ, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారికి న్యాయం చేకూర్చడానికి అధికారులు చొరవ చూపాలని అన్నారు.
ఈ సందర్బంగా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పలు ఇబ్బందుల గురించి తహసీల్దార్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికై పాటించాల్సిన పద్దతుల గురించి కలెక్టర్ సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగం అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.