మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడ, జనవరి 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో జరగబోయే మహాశివరాత్రి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 వ తేదీల్లో జరగనున్న మహాశివరాత్రి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై వేములవాడ ఆలయంలోని ఓపెన్‌ స్లాబ్‌ సమావేశ మందిరంలో ఇటీవల జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెడికల్‌ అఫీసర్లు, పారామెడికల్‌ సిబ్బంది, కమ్యూనిటి హెల్త్‌ అఫీసర్లను అంబులెన్సు వాహనములు ఏర్పాటు చేయాలని దోమల నివారణకై ఫాగింగ్‌, స్ప్రే చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరాల్లో మాస్కులు, సానిటైజర్‌, థర్మామీటర్‌ తప్పకుండా ఉండేలా చూడాలని అవసరమైతే వ్యాక్సినేషన్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.

దేవస్దానము క్యూలైన్లు, పరిసర ప్రాంతములలో రెస్క్యూ టీంలను ఏర్పాటు చేయాలని, వీల్‌ చైర్లు, స్ట్రెచర్‌లు అందుబాటులో ఉంచాలని అన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, అలాగే పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 126 పర్మనెంట్‌ టాయిలెట్స్‌ ఉన్నాయని, మరొక 60 తాత్కాలిక టాయిలెట్స్‌ జాతర కోసం ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటితో పాటు మొబైల్‌ టాయిలెట్లు ఇతర మున్సిపాలిటీల నుండి తెప్పించి, అన్ని ముఖ్య ప్రదేశాల్లో మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఆర్టీసీ అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బస్సులను నడపాలని, యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో బస్సుల సంఖ్య ఇంకా పెంచేలా చూడాలని అన్నారు. ఉచిత బస్సుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బస్టాండ్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. థర్మామీటర్లతో చెక్‌ చేయాలని సూచించారు.

అన్ని పార్కింగ్‌ స్థలాల వద్ద కంట్రోలర్స్‌, సిబ్బందిని ఏర్పాటు చేయాలని, కంట్రోల్‌ రూముల వద్ద ప్రజా సమాచార వ్యవస్ధలు ఏర్పాటు చేసి అనౌన్స్‌ మెంట్‌ సౌకర్యములు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్టీసీ బస్సులు నిలుపు స్థలాల వద్ద మౌళిక వసతుల కల్పన, సానిటేషన్‌ నిర్వహణ, పోలీస్‌ శాఖ వారి సహకారంతో అన్ని పార్కింగ్‌ స్థలాల వద్ద వాహనాల రాకపోకలకు వేరువేరుగా దారులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్ల నిర్వహణకు సంబంధించి వేములవాడకు ప్రవేశించే అన్ని రోడ్లు, బైపాస్‌ రోడ్లు క్లీన్‌గా ఉంచాలని, స్పీడు బ్రేకర్లకు రంగులు, సైన్‌ బోర్డులను అమర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వసతి సౌకర్యములకు సంబంధించి భక్తుల సౌకర్యార్ధము చలువ పందిళ్లు వేసి, లైటింగ్‌, త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని అన్నారు. త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి భక్తులకు సరిపడా సురక్షిత త్రాగునీరు కోసం చలివేంద్రములు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు అవసరమైన సామాగ్రి, సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని సెస్‌ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో వెంటనే వినియోగించుటకు జనరేటర్లు అందుబాటులో ఉంచాలని సెస్‌ అధికారులను ఆదేశించారు.

పోలీస్‌ బందోబస్తుకు సంబంధించి, లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణ, ఆలయం లోపల, పరిసర ప్రాంతములందు, అనుబంధ దేవాలయములందు భక్తులు విడిది చేయు ప్రాంతములందు రక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని పోలీస్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దేవాలయములో ప్రస్తుతము ఉన్న రక్షణ వ్యవస్ధను పటిష్టపరచాలని అన్నారు. అగ్నిమాపకదళ సేవలకు సంబంధించి, అగ్నిప్రమాదములు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రములు పూర్తి సామాగ్రితో గత సంవత్సరము మాదిరిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు.

జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేవాలయములో భక్తుల రద్దీని క్రమబద్దీకరించాలని, అన్ని కౌంటర్ల దారిని తెలపడానికి సూచికల బోర్డులు ఏర్పాటు చేసి పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం ద్వారా, హ్యండ్‌ మైకుల ద్వారా బయటకు వెళ్ళే దారి భక్తులకు తెలియపరచాలని అన్నారు. టికెట్టు కౌంటర్ల వద్ద క్యూలైన్లలో తగు సిబ్బందిని ఏర్పాటు చేసి రద్దీని క్రమబద్దికరించాలని కలెక్టర్‌ అన్నారు.

గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేసి వారికి అవసరమైన సామగ్రి సమకూర్చాలని మత్స్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న కళ్యాణ కట్టలతో పాటుగా భక్తుల సౌకర్యార్ధము అదనముగా వివిధ స్ధలములందు అదనపు కళ్యాణ కట్టలను ఏర్పాటు చేయాలని అన్నారు. మద్యపాన అమ్మకమును నియంత్రించాలని సంబంధిత ఎక్సైజ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. స్వచ్చంద సంస్థల సేవలు వినియోగించుకోవాలని అన్నారు.

జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ పోలీస్‌ శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేసి మహా శివరాత్రి జాతర విజయవంతం అయ్యేలా చూస్తామని అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణ ట్రాఫిక్‌ నియంత్రణ వంటి చర్యలు పకడ్బందీగా చేపడతామని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, భక్తుల దర్శనానికి విఘాతం కలగకుండా పోలీస్‌ శాఖ తరపున పర్యవేక్షణ చేస్తామని అన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, బి.సత్యప్రసాద్‌, ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ వి.లీల, డీఎస్పీ చంద్రకాంత్‌, సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »