నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా పేరుతో గత రెండు సంవత్సరాలుగా రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు, వికలాంగులకు, ఇతర వర్గాలకు ఇప్పటివరకు ఉన్న రాయితీలను తొలగించటం సరైనది కాదని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున పెన్షనర్లు ధర్నా నిర్వహించారు.
నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సీర్పా హనుమాన్లు అధ్యక్షతన జరిగిన ధర్నాలో బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల నాయకులు ఈ .వి. ఎల్. నారాయణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాయితీలను తొలగించటం, రైల్వేలను ప్రైవేటీకరించం సరైంది కాదని అన్నారు. సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహ స్వామి మాట్లాడుతూ రెగ్యులర్ ట్రైన్‌లను కూడా స్పెషల్ ట్రైన్ పేరున ప్రయాణికుల వద్దనుండి దోచుకుంటున్నారని, చట్టప్రకారం సీనియర్ సిటిజన్లకు ఇవ్వవలసిన రాయితీలను ఎగ్గొట్టి రైల్వే శాఖ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు.
అనంతరం రైల్వే స్టేషన్ మేనేజర్‌కు రైల్వేలలో రాయితీలను పునరుద్ధరించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. అదేవిధంగా కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ బాక్సుకు మెమొరాండం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రామ్మోహన్‌రావు, డివిజన్ కార్యదర్శి హమీద్ ఉద్దీన్, జిల్లా ఉపాధ్యక్షులు జార్జి, ప్రసాదరావు, బేబీ, సుదర్శన్ రాజు లావు వీరయ్య, సాయన్న, పుండరీ సాయిలు, రమణ స్వామి, వెంకటేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.