నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై. ఓమయ్య లు మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల పోరాటం ఫలితంగా మున్సిపల్ కార్మికులకు పిఆర్‌సి ప్రకారం 30 శాతం వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 60 విడుదల చేసినప్పటికీ, అమలు చేయకపోవడంతో కార్మిక సంఘాల ఐక్య పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి జీవో నెంబర్ 4 విడుదల చేసిందని, జీవో నెంబర్ 4 ప్రకారం జూన్ నెల నుండి పెంచిన వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కొత్తగా తీసుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు అక్టోబర్ నెల పెండిరగ్ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికి కూడా యూనిఫాంలు, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. పెండిరగ్ ఏరియర్స్‌తో సహా కౌన్సిల్ ఆమోదంతో వేతనాలు పెంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా తీసుకున్న కార్మికులకు కూడా వారాంతపు సెలవులు క్యాజువల్ సెలవులు అమలు చేస్తామని అన్నారు. సీడీఎంఎ అప్రూవల్ రాగానే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు యూనిఫామ్‌లు అందజేస్తామని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, నర్సింగ్ రావు, రాజేశ్వర్, గోవర్ధన్, శివకుమార్, కిరణ్, లక్ష్మీకాంత్, గంగాధర్, శాంతి కుమార్, శివ కుమార్, సూర రవి, రాకేష్, శంకర్, లక్ష్మణ్, రాజమల్లు, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.