నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఇళ్లలో చిన్నారులను ఎలాగైతే అల్లారుముద్దుగా పెంచుతామో, మొక్కలను కూడా అదే తరహాలో ప్రాధాన్యతను ఇస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కల నిర్వహణ బాధ్యతలను మరింత సమర్ధవంతంగా నిర్వర్తించాలని ఆయన హితవు పలికారు.
జిల్లా అటవీ శాఖా అధికారి సునీల్‌తో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం నిజామాబాదు శివారు ప్రాంతమైన సారంగాపూర్ నుండి మొదలుకుని జిల్లా సరిహద్దు ప్రాంతమైన సాలూర వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను పరిశీలించారు. అక్కడక్కడా లోటుపాట్లను గమినించి, వాటిని సరి చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తాను మళ్ళీ పక్షం రోజుల్లో తనిఖీకి వస్తానని, పరిస్థితిలో మార్పు కనిపించాలని అన్నారు. ప్రతి మొక్క బతకాలని, మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కూలీలకు సకాలంలో, సరైన విధంగా వేతనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా మొక్క పాడైపోతే, దాని స్థానంలో కొత్త మొక్క నాటాలని, క్రమం తప్పకుండ మొక్కలకు నీరందించాలని సూచించారు.
జిల్లా సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద మొక్కల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తపర్చారు. నెల వ్యవధిలోపు తాను మూడు పర్యాయాలు సందర్శించినప్పటికీ పరిస్థితిలో ఇంకనూ మార్పు రాలేకపోతోందని అన్నారు. ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా మనం పని చేయనప్పుడు పదవుల్లో ఉండి ప్రయోజనం శూన్యమని పెదవి విరిచారు. మొక్కల నిర్వహణ గాడి తప్పితే హరితహారం లక్ష్యానికి విఘాతం ఏర్పడి ప్రజాధనం వ ృధా చేసినట్లవుతుందని అన్నారు. విధుల పట్ల అలసత్వ వైఖరి ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
తెలంగాణ అంటేనే పచ్చదనం అని మన రాష్ట్రానికి ఎంతో మంచి పేరు ఉందని, దానిని నిలుపుకుంటూ తెలంగాణ గౌరవం మరింతగా ఇనుమడిరచేలా పని చేయాలన్నారు. ఇది రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయినందున పొరుగు రాష్ట్రాల నుండి రాకపోకలు సాగించే వారు అబ్బురపడుతూ ప్రశంసలు కురిపించేలా సాలూర సరిహద్దు వరకు ప్రణాళికాబద్ధంగా పని చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ హితవు పలికారు. ఆయన వెంట ఆయా మండలాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.